ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో
ఎ25గా టీడీపీ అధినేతను చేర్చిన సిఐడి
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఎ25గా సిఐడి పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఎసిబి కోర్టులో సిఐడి అధికారులు పిటి వారెంట్ వేశారు. చంద్రబాబు నిందితుడిగా పేర్కొన్న ఫైబర్‌నెట్ కుంభకోణం గురించి పరిశీలిస్తే నిబంధనలను ఉల్లంఘించడం, టెండర్ ప్రక్రియలో అవకతవకలు చేయడం. చంద్రబాబు హయంలో ఆయన ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి శాఖలను కూడా కలిగి ఉన్నప్పుడు ఈ స్కాం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎపి ఫైబర్‌నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. రూ.330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్‌ను అనుకూలమైన కంపెనీకి కేటాయించడానికి టెండర్ ప్రక్రియను తారుమారు చేసినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
పేస్ పవర్ వంటి ఇతర బిడ్డర్ల నుండి వచ్చిన నిరసనలను నిశ్శబ్దం చేయడం ద్వారా టెండర్‌ను టెరా సాఫ్ట్‌వేర్‌కు అప్పగించారనేది ఆరోపణ. టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయని, దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని సిఐడి ఆరోపించింది. నాసిరకం మెటీరియల్‌ని ఉపయో గించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నప్పుడు ఆర్‌ఎఫ్‌పిలో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సామర్థ్యంలో దాదాపు 80 శాతం నిరుపయోగంగా మారిందని వెల్లడించింది.









