గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
డీకే అరుణ ఎమ్మెల్యేగా ప్రకటన
తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వరుస షాకులు తగులుతున్నాయి. గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫడవిట్ దాఖలు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తరువాతి స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హత వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు.
పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది. మళ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ .. బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు.
కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్‌ఎస్ లోకి వచ్చారు. బీఆర్‌ఎస్ తరపున ఓడిన జలగం వెంకట్రావుకు అనుకూలంగా తీర్పు వచ్చినా.. వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకూ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించలేదు. తాజాగా మరోసారి సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసినందునా.. తీర్పును ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్ వెంటనే అమలు చేసే అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు.









