భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే మానసిక ఆందోళనగురైన ఓ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్ కుమార్ (30) కు పదేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లాపొత్కపల్లి మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. సౌజన్యకు వివాహానికి ముందునుంచే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉందనే కారణంతో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. మంచిగా ఉంటానని పెద్దలకు సౌజన్య చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
ఎన్నిసార్లు చెప్పిన తన భార్య వినకపోవడంతో మానసిక ఆందోళనకు గురైన అనిల్ ఈనెల 6న ఇంట్లో గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు వెంటనే ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఇంటికి వెళ్లిన అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 9న కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే అనిల్ మృతి చెందాడు. తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.