బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతు న్నాయని, ఇందులో తాను భాగస్వామ్యమయ్యేందుకు సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నానని కోనేరు సత్యనారాయణ(చిన్ని) తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన తాను బీజేపీకి గుడ్‌బై చెప్పినట్టు స్పష్టం చేశారు.
తనను బీజేపీ తనను ఎంతో గౌరవించి జిల్లా బాధ్యతలు అప్పగించిందని.. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పార్టీ అధికారం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, అన్నివర్గాలకు సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానన్నారు. కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదని, మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారమన్నారు. తన తండ్రి మాజీమంత్రి, దివంగత నేత కోనేరు నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ ఉన్న మిత్రబంధం నేపథ్యంలో తనను కేసీఆర్ ఆహ్వానించారన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.









