తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ బిల్లు వ్యవహారం కూడా రసవత్తరంగా మారింది. రసవత్తరంగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం, ఎమ్మెల్యే అవ్వడం వంటి విషయాలపై ఆయన స్పందించారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు. రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో… ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ధూల్ పేట్ లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని.. అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారని రాజాసింగ్ తెలిపారు. ఇదే సమయంలో అసెంబ్లీలో తానున్నా లేకున్నా.. ధూల్ పేట్ ని అభివృద్ధి చేయాలని స్పీకర్ ని రాజాసింగ్ కోరడం గమనార్హం.









