AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీసీ కార్మికులు మాత్రమే విలీనం

ఆర్టీసీ విలీనంకు సంబంధించిన బిల్లుపై గవర్నర్‌ లేవనెత్తిన ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేషన్‌ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్లు, తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. కార్మికులతో చర్చించే అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పింది. వేతనాలు, భత్యం, కేడర్‌, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఈ మేరకు గవర్నర్‌ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

గవర్నర్ ఏం అడిగారు..?

1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవేం..?

రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో ఎందుకు లేవు..?

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా..? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి..?

విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా..? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి..?

ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.

ప్రభుత్వం ఏం చెప్పింది..?

ఏపీ తరహాలోనే టీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం విధానాన్నే అమలు చేస్తాం.

ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటాం.

టీఎస్ఆర్టీసీ సంస్థ యథాతథంగా కొనసాగుతుంది.

టీఎస్ఆర్టీసీ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదు.

ప్రభుత్వంలో విలీనం జరిగిన తర్వాత కూడా కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటాం.

కేంద్రం వాటాలు, లోన్‌లపై నిబంధనలు పాటిస్తాం

కార్మిక చట్టాలను గైడ్‌లైన్స్ ప్రకారం అమలు చేస్తాం

ఆర్టీసీని మించి జీతభత్యాలు ఇస్తాం

అసెంబ్లీలో బిల్లు పాసైన తర్వాత విధివిధానాలను ఖరారు చేస్తామని గవర్నర్‌కు నిశితంగా లేఖలో వివరించింది కేసీఆర్ సర్కార్.

ANN TOP 10