రాజ్‌భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. యూనియన్ నాయకులు రాజ్ భవన్ రావాలని గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సర్కార్ భావించింది. అయితే ఇది ఆర్ధిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం తప్పనిసరి అయింది. అయితే ఈ బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలపకపోగా..తనకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఐదు అంశాలను ప్రభుత్వానికి పంపించింది.
అయితే గవర్నర్ బిల్లును ఆమోదించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. యూనియన్ నాయకులు రాజ్ భవన్ రావాలని గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. ఈరోజు ఉదయం 11:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో గవర్నర్ చర్చించనున్నారు.
మరోవైపు రాజ్ భవన్ కు ముట్టడిగా వెళ్తున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ఆర్టీసీ కార్మికులు ముందుకెళ్తున్నారు. దీనితో ఖైరతాబాద్-రాజ్ భవన్ రోడ్డులో వాహనాలను ఆపేశారు. అయితే గవర్నర్ నుంచి పిలుపు రావడంతో కార్మికులు వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. కాగా తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉండడంతో యూనియన్ నాయకులతో ఆమె చర్చలు జరపనున్నారు.









