పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట లభించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని అన్నారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందన్నారు. న్యాయం గెలిచిందని… ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్ళీ విశ్వాసం పెరిగిందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.









