రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్100 కి లేదా స్థానిక పోలీసు పోలీసులకు గానీ సమాచారం అందిన వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.
గురువారం దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, రెడ్ అలర్ట్ ప్రకటించారని, అలాగే గురువారం కొన్ని ఈశాన్య, తూర్పు తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వరద ఉదృతితో తెగిపోయిన రోడ్లు, ఉదృతంగా ప్రవహించే కాజ్‌వేల వద్దకు ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఆదేశించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్లలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.









