-ఈ జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో గ్యాప్ లేకుండా వానలు కుమ్మేస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే.. తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో నగర ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని సూచించారు. మరోవైపు.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అటు ఏపీలోని పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గురువారం కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ పడతాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ఇవ్వగా.. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు భారీ వర్షాలతో కూడిన ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.










