గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం టీఎస్ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఇవాళ ‘టి9-30 టికెట్’ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు.
ఈ టికెట్‌కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ఇష్యూ చేస్తారని వెల్లడించారు.
“పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులందరికీ ఈ రాయితీ పథకం వర్తిస్తుంది. స్వల్ప దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు టి9-30 టికెట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ టికెట్ తో 30 కిలోమీటర్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రానూపోను ప్రయాణం చేయొచ్చు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుంది. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుంది.









