భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం (జూలై 18) సాయంత్రం నీటి మట్టం 20 అడుగులు ఉండగా.. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 30 అడుగులకు చేరింది. రేపు ఉదయంకల్లా వరద ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతున్నారు. అటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో గోదావరి వద్ద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కిందటేడాది భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు సహా పరిసర గ్రామాల ప్రజలు కట్టు బట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన సంగతి తెలిసిందే.









