AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కారు దిగనున్న తీగల.. కోడలు సైతం అదేదారిలో..!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార పార్టీ బీఆర్ఎస్‌‌కు షాకుల మీద షాక్‌లు తగుతున్నాయి. ఇప్పటికే కొంత మంది బాడా నేతలు కారు దిగి ప్రతిపక్ష పార్టీల గడప తొక్కగా.. అదే దారిలో మరికొంత మంది కూడా నడుస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ నేత, మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి పార్టీకి గుడ్‌బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గౌరవం లేని చోట తాము ఎలా ఉండగలమని..? ఇప్పటికే ఆయన తన ఆవేదన బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని రహస్యంగా కలిసి, పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మంగళవారం పలు చానళ్లలో ఇదే అంశంపై వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే తాను బీఆర్‌ఎస్‌ను వీడుతున్నాననే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని తీగల చెబుతుండడం కొసమెరుపు.

టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన తీగల కృష్ణారెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబు హయంలో హైదరాబాద్‌ మేయర్‌గా పని చేశారు. 2014 వరకు అదే పార్టీలో కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో అదే పార్టీ నుంచి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి పటోళ్ల సబితారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలు పొందిన సబిత ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. కొంత కాలంగా మంత్రికి.. మాజీ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదు. ఓటమి పాలైనంత మాత్రనా ఇంతలా అవమానిస్తారా? కాంగ్రెస్‌ అభ్యర్థిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గౌరవం లేని చోట ఎలా ఉండగలను? అంటూ ఆయన ఇటీవల బహిరంగానే తన ఆవేదన వెళ్లగక్కారు.

తీగల దారిలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుతం రెండు జిల్లాల స్థానిక సంస్థలకు చెందిన కీలక నేతలు కూడా ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లి్ పార్టీ అధినేత రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డి, సీనియర్‌ నేత కొత్త మనోహర్‌రెడ్డి పార్టీని వీడిన విషయం తెలిసిందే.

ANN TOP 10