AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దమ్ముంటే ఇచ్చిన హామీలను నెరవేర్చండి.. షర్మిల ఫైర్‌

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్.. అధికారంలో వచ్చిన తర్వాత పథకానికే పంగనామాలు పెట్టారని ఆరోపించారు. రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ అని విమర్శనస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే మోసం చేశారని, పూటకో మాట, రోజుకో వేషం వేస్తున్నారని షర్మిల ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.

రూ.లక్ష రుణమాఫీ చేయడానికి నాలుగు సంవత్సరాలుగా లక్షల మాటలు చెప్పారు తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలేదని షర్మిల తెలిపారు. మాట ఇస్తే తల నరుక్కుంటామని రుణమాఫీపై చేసిన వాగ్దానాలు దొర గడప దాటలేదని, దొర మాట నమ్మి ఓటేసిన రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నారు. అన్నం పెట్టే రైతన్నకు కేసీఆర్ ద్రోహం చేశారని, రైతులు ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్‌కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు. రైతు బంధు పైసలను వడ్డీల కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నా కేసీఆర్ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

ANN TOP 10