తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపే గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండడంతో ఏ విధమైన అవకతవకలు, తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు TSPSC వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వారి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్, పేరు, జెండర్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు సరి చూసుకోవాలని సూచించింది.
మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. తాళి, మెట్టెలు తీయాలనే ప్రచారం అవాస్తవమన్నారు. ఇంకా మాట్లాడుతూ ”గ్రూప్-4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. కొన్నిచోట్ల తాలుకా, మండల స్థాయిలోనూ పరీక్ష కేంద్రాలు ఉండటంతో బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. పరీక్ష ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షాసమావేశాలు నిర్వహించాం. సుమారు 40 వేలమంది ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పరీక్ష కేంద్రంలో విధులు, నిబంధనలు తదితర అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాం. ప్రతి పరీక్ష కేంద్రంలో యువతి, యువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశాం. అందుకు సరిపడా మహిళా సిబ్బందిని నియమించాం. అభ్యర్థులు రెండుగంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాళిబొట్టు, మెట్టెలు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదు. హిందూ సంప్రదాయాలను కించ పరుస్తున్నారని కొందరు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఇటువంటి అసత్య ప్రచారాల వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది” అని చెప్పారు.
పర్సనలైజ్డ్ ఓఎంఆర్ షీట్‌పై క్లారిటీ
అభ్యర్థుల వివరాలు, ఫొటోతో కూడిన పర్సనలైజ్డ్ ఓఎంఆర్ షీట్‌ను టీఎస్‌ఎపీఎస్సీ ఉపసంహరించుకొన్నదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషన్ అధికారులు తెలిపారు. మొదటి నుంచి తాము పర్సనలైజ్డ్ షీట్లను వినియోగించడం లేదని స్పష్టంచేశారు. యూపీఎస్సీ వంటి జాతీయ స్థాయి సంస్థలు కూడా సాధారణ ఓఎంఆర్ షీట్లనే వినియోగిస్తాయని వెల్లడించారు. వీటిపై హాల్‌టికెట్ నంబర్, సెంటర్ పేరు, అభ్యర్థుల ఫొటోలు ఉండవని తెలిపారు.









