తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్‌ను (Folk Singer Saichand) తెలంగాణ సమాజం మరువదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP komatireddy Venkatreddy) అన్నారు. సాయిచంద్ ఆకస్మిక మరణం విచారకరమన్నారు. చిన్న వయసులోనే సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తాను నల్గొండలో నిరాహార దీక్ష చేసినన్ని రోజులు పాటలు పాడుతూ తన వెంటే ఉన్నారు సాయిచంద్ అని గుర్తుచేశారు.
రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని.. ఎప్పటికీ జనం గుండెల్లో ఉంటుందని తెలిపారు. తన ఆట పాటలతో ప్రజలలో నాడు సాయిచంద్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని అన్నారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు.. సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన స్వరం ఆయువుపట్టుగా నిలిచిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.









