తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ సీరియస్ గా ఎన్నికలపై ఫోకస్ చేశాయి. ఇక తెలంగాణ బీజేపీలో మార్పులు చేయాలని ఆ పార్టీలోని నేతలు కొందరు పార్టీ నాయకత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. ఒకవేళ మార్పులు చేయకపోతే.. తమ దారి తాము చూసుకుంటామనే సంకేతాలు ఆ నేతలిద్దరూ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ నాయకత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ ను నియమించే అవకాశం ఉందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఈ విషయంలో పార్టీ నాయకత్వం మరో ఆలోచన చేస్తోందనే టాక్ మొదలైంది. బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించి.. ఆయన స్థానంలో కేంద్ర కేబినెట్ లోకి బండి సంజయ్ ను తీసుకోవాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తెలంగాణ బీజేపీలో చేరికలు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులు, నేతలను కలవరపెడుతోంది.
ప్రస్తుతం ఉన్న టీమ్ కారణంగానే చేరికలు లేవనే భావనలో ఉన్న ఆ పార్టీ నాయకత్వం.. ఇందులో మార్పులు చేర్పులు చేయాలని.. ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి రెండుసార్లు అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఈటల, రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై వివరించడంతో పాటు తమ పరిస్థితిని కూడా చెప్పినట్టు తెలుస్తోంది.
వారి సూచనలకు తగ్గట్టుగానే వ్యవహరించాలని భావిస్తున్న పార్టీ నాయకత్వం.. బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర కమిటీ సారథ్య బాధ్యతలు అప్పగించే దిశగా ఆలోచిస్తోందని.. దీంతో పాటు ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించేందుకు సమాయత్తమవుతోందని తెలుస్తోంది.









