ఢిల్లీ: సీఎం కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై చర్చించామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్ ప్రారంభించిందని, వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని చెప్పారన్నారు. కర్నాటకలో అవలంభించిన కొన్ని వ్యూహాలు తెలంగాణలో అమలు చేస్తామని, కర్నాటకలో తరహాలోనే తెలంగాణలోనూ భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయానుందో త్వరలోనే చెప్తామన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై ఈ రోజు సమావేశంలో చర్చించించినట్లుగా తెలిపారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేతలు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు చూస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజల డబ్బు వృథా అవుతోందన్నారు. ప్రజల సొమ్మంతా ఒక పార్టీ ప్రచార ఖర్చులకే పోతోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఆశించిన మార్పురాలేదన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందన్నారు. గడపగడపకు వెళ్తాం, కేసీఆర్ కుటుంబ దోపిడీని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. భేటీకి రేవంత్ రెడ్డి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్‌తోపాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.









