విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దు..లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ మనవడిగా లోకేష్‌ను ప్రజలు స్వీకరించడం లేదన్నారు ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. అసలు ఆ పోలికే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని.. లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో అవినీతిని తీసుకొచ్చి ప్రస్తుత వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగినట్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పనికి మాలిన నారా లోకేష్ కోసం చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించినా మార్పు రాలేదన్నారు. చంద్రబాబు తనయుడిని కూడా సరైన మార్గంలో పెంచలేదని.. రూ.60 కోట్లు ఇచ్చి సర్టిఫికెట్‌లు కొని ఇతర దేశాల్లో చదువుకొన్నాడని అందరికి తెలుసన్నారు.
నందమూరి అభిమానులు చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలన్నారు. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్త పుత్రుడు కలిసి రాష్ట్రంలో ఎంత తిరిగినా లాభం లేదని.. ప్రజలు నమ్మరన్నారు. అధికారంలోకి రాక ముందే చంద్రబాబు సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడు సైతం చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటూ సెటైర్లు పేల్చారు. ఎక్కడో సినిమాలు చేసుకుంటున్న పవన్‌ని తెర మీదకు తెచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నారు మండిపడ్డారు. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలోనే పవన్‌కు సూచించాను అన్నారు.
ఎన్టీఆర్ పాలన అద్భుతమని ప్రశంసించారు. చంద్రబాబు పాలనలో ఏపీలో అభివృద్ధి జరగలేదని.. అన్ని అబద్దాలు చెప్పి పాలన చేశారన్నారు. గతంలో వైఎస్సార్ ఎంతో అద్భుతంగా పాలన చేశారని.. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్నారు. మేనిఫెస్టోలలో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేశారని.. ఇచ్చిన హామీల్లో 99.5శాతం పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వాలు తమ పాలనలో 5 శాతం కూడా తమ మేనిఫెస్టో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందన్నారు.









