AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తీవ్ర ఎండలతో రైలు పట్టాలు వంకర.. తప్పిన పెను ప్రమాదం

తీవ్ర ఎండల వల్ల కరిగిన రైలు పట్టాలపై ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లింది. దీంతో ఆ రైలు పట్టాలు వంకరయ్యాయి. లోకోపైలట్‌ దీనిని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో పరిధిలో ఈ సంఘటన జరిగింది. లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్‌లో తీవ్రమైన ఎండ వేడి వల్ల లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోయాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మెయిన్‌ లైన్‌లో మరో రైలు నిలిచి ఉంది. దీంతో రైలు పట్టాలు కరిగిన లూప్‌ లైన్‌పై నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది.

ఈ నేపథ్యంలో కరిగిన ఆ రైలు పట్టాలు వ్యాపించడంతో వంకరుగా అయ్యాయి. కాగా, రైలు పట్టాలు జరుగడం గమనించిన నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్‌ వెంటనే ఆ రైలును నిలిపివేశాడు. కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ స్టేషన్‌ మాస్టర్‌ కూడా స్పందించారు. ఆ లూప్‌లైన్‌ మీదుగా ఎలాంటి రైళ్లు వెళ్లకుండా రైల్వే సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు పట్టాలను సరి చేసే పనులు చేపట్టారు.

మరోవైపు అక్కడి నుంచి కదిలిన నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లక్నో జంక్షన్‌ స్టేషన్‌ చేరుకుంది. లోకోపైలట్‌ ఈ సంఘటన గురించి రైల్వే ఉన్నతాధికారులకు చెప్పాడు. దీంతో సీనియర్‌ రైల్వే అధికారులు, సిబ్బంది కూడా నిగోహన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి పరిశీలించారు. అయితే లూప్‌ లైన్‌లోని రైల్వే ట్రాక్‌ నిర్వాహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు నిఫుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని లక్నో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సురేష్ సప్రా ఆదేశించారు.

ANN TOP 10