ట్రెవర్ డేనియల్ జాకబ్ వాలెట్ అనే ఓ యూట్యూబర్ తన వీడియోకు లైకులు, వ్యూస్ కోసం దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘనుడు ఏకంగా విమానాన్ని కూల్చేశాడు. దీని మీద అధికారులు విచారణ చేపట్టినప్పుడు తనకేం తెలియదని.. ఇంజన్ ఫెయిల్ అవ్వడంతోనే విమానం కూలిపోయిందని బుకాయించాడు. కానీ, అధికారులు వదలకుండా తమదైన స్టైల్లో ఆధారాలతో సహా అతడిని ప్రశ్నించడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు. ట్రెవొర్ జాకబ్ అనే యూట్యూబర్ అమెరికాలోని ఒలంపిక్స్ స్నోబోర్డు క్రీడాకారుడు. అమెరికా తరఫున 2014లో రష్యాలోని సోచీలో జరిగిన వింటర్ ఒలంపిక్స్ స్నో బోర్డులో సెమీఫైనల్స్ వరకు వెళ్లగలిగాడు.
ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా జాకబ్ పాల్గొన్నాడు. జాకబ్ కు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్ లో ఎక్కువగా స్కై డైవింగ్, ఏవియేషన్, స్నో బోర్డింగ్ కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తాడు. ఇవి చాలా ఆసక్తిగా ఉంటుండడంతో చాలామంది అతడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2021 నవంబర్ 24న మరణించిన తన స్నేహితుడి బూడిదను వెదజల్లాలని చెప్పి లోంపోక్ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్ ఇంజిన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అద్దెకు తీసుకుని బయలుదేరాడు. లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్ పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అందులో ఉన్న ట్రెవొర్ పారాషూట్ సహాయంతో తప్పించుకున్నాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిని అందరూ ఇది ప్రమాదం అనే మొదట అనుకున్నారు. అయితే ఈ విమాన ప్రమాదం మీద కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఆ విమాన శకలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని అడగగా.. అది ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ట్రెవొర్ తెలిపాడు. ఆ తర్వాత ఓ హెలికాప్టర్లో తన మిత్రులతో కలిసి విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి వాటి శకలాలను వేరే ప్రదేశానికి మార్చాడు. వాటిని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మిగిలిన విమాన భాగాలను విమానాశ్రయం, మరి ఇతర ప్రదేశాల్లోని చెత్తలో పడేశాడు. దీని మీద అప్పటినుంచి దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ దర్యాప్తు బృందం 2022లో విమానాన్ని జాకబ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని నిర్ధారించింది.









