విమానం గాల్లో ఉండగానే ఓ 23 ఏళ్ల యువతి అనుచితంగా ప్రవర్తించడంతో ప్రయాణికులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో గొడవపడిన ప్రయాణికుడిపై ఆ మహిళ గాజుసీసాతో దాడికి ప్రయత్నించింది. పరిస్థితి చేజారుతుండటంతో విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ నుంచి బయలుదేరిన విమానంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్వీన్స్‌లాండ్‌లోని కైన్స్ నుంచి ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతం గ్రూటే ఎలెండెంట్‌కు విమానం బయలుదేరిన కాసేపటికి అందులోని ముగ్గురు ప్రయాణికుల మధ్య వివాదం మొదలైంది. వారి మధ్య తలెత్తిన వాగ్వాదం చినికిచినికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళ గాజుసీసాతో మరో ప్రయాణికుడిపై దాడికి ప్రయత్నించింది. ఒకరినొకరు తోసుకొని, తన్నుకొన్నారు. సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఆగలేదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో విమానాన్ని మళ్లీ క్వీన్స్‌ల్యాండ్‌కు మళ్లించారు.
మహిళా ప్రయాణికురాలిని కిందకు దింపేయడంతో గొడవ సద్దుమణిగిన తర్వాత విమానం మళ్లీ టేకాఫ్ అయ్యింది. కానీ, విమానం బయలుదేరిన తర్వాత వారు మళ్లీ గొడవకు దిగారు. ఈసారి గొడవ తారస్థాయికి చేరడంతో విమానం కిటికీ అద్దాలతోపాటు కొన్ని వస్తువులు పగిలిపోయాయి. దీంతో విమానాన్ని అల్యాంగుల విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఈ ఘర్షణకు తోడు మరో ప్రయాణికుడి వద్ద మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.









