ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై బీహార్ లోని పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) విషయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్‌కు ఉరిశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు.
పేదలు, దళితులు, బలహీన వర్గాల ఓటు హక్కులను హరిస్తున్నారని పప్పు యాదవ్ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విమర్శించారు. ఆయనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
జ్ఞానేశ్ కుమార్‌కు ఆర్‌ఎస్‌ఎస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ మద్దతు ఉందని పప్పు యాదవ్ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ప్రతిపక్షాలు ఏకమై అన్ని ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్‌లో జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాలని కోరారు.
‘సర్’ ప్రక్రియపై ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో పప్పు యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కొన్ని నిర్ణయాలు, ప్రక్రియలపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.
దేశంలో 13 కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగిందని పప్పు యాదవ్ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయనపై దేశద్రోహం కేసుతో పాటు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముకేశ్ సహానీ కూడా జ్ఞానేశ్ కుమార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హత్య చేసి తప్పించుకునే అవకాశమే ఉంటే.. జ్ఞానేశ్ కుమార్‌ను కాల్చిపారేసేవాడినని వ్యాఖ్యానించారు.








