వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్‌కు వైఎస్ విజయమ్మ వెళ్లారు. షర్మిలను కలిసేందుకు విజయమ్మ పీఎస్ లోపలికి వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. తన కూతురిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.
వైఎస్ విజయమ్మను కారులో నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. దీంతో తన కూతురిని చూడటానికి ఎందుకు అనుమతించరంటూ పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. వాదిస్తున్న ఓ మహిళా అధికారిని కొట్టారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని విజయమ్మ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ప్రశ్నించడానికి షర్మిల బయటకు వచ్చిందని, అందుకు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పీఎస్ ముందు విజయమ్మ కారులోనే కాసేపు ఉండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.









