దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను ప్రతిబింబించే ‘పురాతన కట్టడాలు‘ ప్రపంచ వ్యాప్తంగా అనేకం నెలకొన్నాయి. వీటిని సంరక్షించి భవిష్యత్తరాలకు అందిం చే బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునెస్కో’ (యుఎన్‌ఎస్‌సిఒ) ఆధ్వర్యంలో ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాల’ గుర్తింపు, నిర్వహణ జరుగుతుంది. ప్రపంచ దేశాల్లోని వారసత్వ సంపద పరిరక్షణకై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్తంగా ఆఫ్రికాలోని ‘ట్యునీషియా’లో 1982 ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించింది. ఆ రోజును ప్రతి ఏటా ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వారసత్వ మార్పు లు అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ దేశాల్లోని అడవులు, పర్వతాలు, సరస్సులు, ఎడారిలు, కట్టడాలు, నగరాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడతాయి.
ఒక దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ దేశ వారసత్వాన్ని భావితరాలకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో వారసత్వం ప్రదేశాలు 1157 ఉన్నాయి. ఇందులో 900 సాంస్కృతిక, 218 సహజ సిద్ధ, 39 మిశ్రమ స్థలాలుగా పేర్కొనడం జరిగింది. భారత దేశంలో 38 ప్రపంచ వారసత్వ స్థలాలు గుర్తింపు పొందాయి. 2021లో గుజరాత్‌లోని దోలవీరాదేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడంతో ఇవి 40కి చేరాయి. అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశాలలో భారత దేశం ఆరవ స్థానాన్ని ఆక్రమించింది. వారసత్వ స్థలాలు పర్యాటక కేంద్రాలుగా దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయి. దేశ చరిత్ర సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే గుర్తులుగా ఉంటాయి. భారత దేశంలో పురాతన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే అనేక కట్టడాలు సింధు నాగరికత కాలం నుంచే ఉన్నవని చెప్పవచ్చు. మన దేశంలో వారసత్వ ప్రదేశాలుగా కోటలు, గుహలు దేవాలయాలు, మసీదులు, పరిపాలనా భవనాలు, వన్య సంరక్షణ కేంద్రాలు, పార్కులు మొదలైనవి అనేకం ఉన్నాయి.









