దేశంలో భారతీయ జనతా పార్టీని (బీజేపీ) సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా, బలం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘జాతీయ విద్యా దినోత్సవం’, ‘మైనార్టీ సంక్షేమ దినోత్సవం’ వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ గల్లీల నుంచి బయలుదేరే ‘కారు’ గుర్తు.. ఢిల్లీ చేరేసరికి బీజేపీ ‘కమలం’ పువ్వుగా మారిపోతోందని ఆయన చమత్కరించారు. కేంద్రంలో బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కొనసాగిస్తోందని విమర్శించారు.
మైనార్టీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని సీఎం మండిపడ్డారు. పేద మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లను రద్దు చేయాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడని ఆయన ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. మైనార్టీ రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ.. చేతనైతే ముందుగా ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆ రిజర్వేషన్లను రద్దు చేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. పేదలకు, మైనార్టీలకు ఓటు హక్కు కల్పించి రాజకీయంగా బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే, బీజేపీ మాత్రం వారి హక్కులను కాలరాయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని సీఎం చెప్పారు. పాతబస్తీలోని సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. పాతబస్తీలో మెట్రో రైలు పనులను ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా పాతబస్తీకి చారిత్రక పూర్వవైభవాన్ని తీసుకొస్తామని, మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ‘నైట్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
దేశంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలకు (ఐటీఐ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ బలమైన పునాది వేశారని సీఎం గుర్తుచేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేసిందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత విస్తరిస్తున్న వేళ, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఏఐ రీప్లేస్ చేయలేని ‘బ్లూ కాలర్’ ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. సరైన నైపుణ్యాలు ఉంటే బ్లూ కాలర్ జాబ్స్ రంగంలో అవకాశాలకు కొరత ఉండదన్నారు. యువతలో నైపుణ్యాలు, క్రీడలను ప్రోత్సహించేందుకే ఇప్పటికే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’, ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’లను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించాలని, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని పిలుపునిచ్చారు.
రాజకీయంగానూ మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని సీఎం తెలిపారు. గతంలో గులాం నబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు అనేక మంది నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామని, ప్రస్తుతం మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించామని గుర్తుచేశారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ వంటి మైనార్టీ క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకాలతో పాటు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను అందించి గౌరవించిన విషయాన్ని ప్రస్తావించారు.
దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు అప్పగించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ సమగ్ర విద్యా విధాన రూపకల్పనలో ఆజాద్ పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








