బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలుగుదేశం, వైసీపీ నాటకాలాడుతున్నాయని, ఓట్ల కోసం బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈ తీర్పుపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ… రెండు పార్టీలు ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. “చట్టపరంగా నిలబడవని తెలిసి కూడా రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటేలా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా వెనువెంటనే కోర్టుల్లో కేసులు వేయించడం వీరికి పరిపాటిగా మారింది” అని ఆయన ఆరోపించారు. ఈ విధంగా బీసీలను మభ్యపెట్టి, కోర్టు తీర్పులు రాగానే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.









