AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విచిత్రమైన ఘటన..!15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు..!

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. గత 15 ఏళ్లుగా తనకు రాఖీ కడుతూ సోదరుడిగా భావించిన యువకుడినే ఒక యువతి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి రెండు కుటుంబాల మధ్య తీవ్ర వివాదానికి దారితీయడమే కాకుండా.. యువతి బతికుండానే తండ్రి కర్మకాండలు నిర్వహించే స్థాయికి వెళ్లింది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 20 ఏళ్ల నందిని పాండే అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల శాశ్వత్ గుప్తాలు సెప్టెంబర్ 20 అర్ధరాత్రి ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనిపై నందిని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాశ్వత్ గత కొన్నేళ్లుగా తమ ఇంటికి క్రమం తప్పకుండా వస్తుండేవాడని, నందిని అతనికి దాదాపు 15 ఏళ్లుగా రాఖీ కడుతోందని యువతి తల్లి తెలిపింది. అతడిని సొంత కొడుకులా చూసుకున్నామని వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే విషయం తమకు అస్సలు తెలియదని కన్నీరు పెట్టుకుంది. అయితే శాశ్వత్ తమ కుమార్తెను మాయమాటలతో లోబరుచుకున్నాడని.. ఇంట్లో ఉన్న రూ.2 లక్షలతో తమ కుమార్తె పారిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలను నందిని పాండే పూర్తిగా ఖండించింది. పెళ్లి తర్వాత ఆమె ఒక వీడియోను విడుదల చేస్తూ.. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ప్రేమవివాహం చేసుకున్నామని స్పష్టం చేసింది. తాను స్వచ్ఛందంగానే ఇల్లు వదిలి వచ్చానని, ఇంట్లో రూ. 2 లక్షలు తీసుకువెళ్లాననడంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. పైగా గత కొంతకాలంగా తన తండ్రి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని.. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించలేదని ఆరోపించింది. ప్రస్తుతం తన భర్త, అత్తమామలే తనకు అండగా ఉండి వైద్యం చేయిస్తున్నారని తమను ఎవరూ వేధించవద్దని ఆమె వీడియోలో వేడుకుంది.

మరోవైపు తన కూతురి పెళ్లి వార్త తెలియడంతో నందిని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ పరువు తీసిన కూతురు.. తమకు ఇక లేనట్లేనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా బతికుండగానే కూతురుకి అంత్యక్రియలు నిర్వహించారు. నందినితో అన్ని సంబంధాలనూ తెంచుకుంటున్నామని, ఇకపై తమకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. మరోవైపు సదరు యువకుడ్ని చేసుకోవడం వల్ల ఆమె భవిష్యత్తు, భద్రత సమస్యలు వాటిల్లే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. మెుత్తంగా శాశ్వత్, నందిని పెళ్లి.. ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10