గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం శాసనసభలో 22-ఏ నిషేధిత భూములపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల ఆస్తులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని పొంగులేటి విమర్శించారు. రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత ప్రభుత్వం పాలన సాగించిందని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని, పోర్టల్‌పై ఉన్న నియంత్రణను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు.
పోర్టల్‌లోని సాంకేతిక లోపాల వల్ల లక్షలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం, వారి బంధువులు మాత్రమే లబ్ధి పొందారని, సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. శాసనసభ సాక్షిగా తమ అక్రమాలు బయటపడుతుండటంతోనే గత పాలకులు చర్చ నుంచి పారిపోతున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు. భూ పరిపాలన, ధరణి పోర్టల్ అంశాలపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.







