రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు పోలీసు నేర పరిశోధనకు వెన్నుముక లాంటివని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఈరోజు రాజమండ్రిలో పర్యటించిన ఆయన… రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రూ.253 కోట్లతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద స్టేట్ లెవల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విశాఖ సహా పలు కేంద్రాల్లో ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. డీఎన్ఏ నివేదికలను ప్రస్తుతం 7 రోజుల్లోనే, అత్యంత కీలకమైన కేసుల్లో 13 గంటల్లోనే అందిస్తున్నామని చెప్పారు. అలాగే, సైబర్ నేరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ‘క్లిక్’ (CLICK) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజమండ్రి గోదావరి పుష్కరాల సందర్భంగా రద్దీ నివారణకు అధునాతన డ్రోన్లు, రికార్డింగ్ మోడ్‌లోని సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని డీజీపీ పేర్కొన్నారు.








