ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య శనివారం ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ మండపంలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించి, బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
సమావేశం ప్రారంభంలో ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్‌కు సాదరంగా స్వాగతం పలికారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు చైనా అందించిన మద్దతుపై ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. “మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది. బ్రిక్స్ సదస్సులో మీ సానుకూల వైఖరికి ధన్యవాదాలు. ద్వైపాక్షిక సహకారంపై చర్చించేందుకు మనకు ఇప్పుడు మంచి అవకాశం లభించింది” అని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.
ఈ భేటీకి ముందు ఇరు నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. భారత్ మండపంలో ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు పరస్పరం కరచాలనం చేస్తూ చిరునవ్వుతో కనిపించారు. అంతకుముందు, బ్రిక్స్ నేతలకు స్వాగతం పలికే వేదిక వద్ద ఏర్పాటు చేసిన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయ చిత్రం నేపథ్యం గురించి ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడికి క్లుప్తంగా వివరించారు.
2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాల దెబ్బతిన్న నేపథ్యంలో, వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొనడం ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి అత్యంత కీలకమని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. ఇరు దేశాల నేతల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో కలిసి పనిచేస్తామని చైనా రాయబారి కూడా శుక్రవారం వ్యాఖ్యానించారు.
అంతకుముందు, బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న జీ జిన్‌పింగ్‌కు విమానాశ్రయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు.







