ఏపీ రాజకీయాలు గత కొంతకాలంగా క్రెడిట్ చోరీ చుట్టే తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏది ప్రారంభోత్సవం చేసినా.. దానికి తమ హయాంలోనే బీజం పడినట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఇలా ఏది తీసుకున్నా వైసీపీ, టీడీపీ మధ్య క్రెడిట్ వార్ నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ vs జగన్ గా ఈ అంశం మారిపోయింది. పులివెందులలోని త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ కేంద్రంగా ఈ క్రెడిట్ చోరీ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు ఘనత తమదంటే తమదని ఇరు పార్టీలు ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం చర్చకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం క్రెడిట్ నిజంగా ఎవరికి దక్కుతుందో ఈ కథనంలో చూద్దాం.
జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో 5.5 లక్షల మంది దాహార్తిని తీర్చే లక్ష్యంతో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద రూ.480 కోట్ల అంచనా వ్యయంతో 2021లో వైఎస్ జగన్ ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ నిధులు పుష్కలంగా ఉన్నా, రెండేళ్లలో పూర్తి చేసే అవకాశమున్నా జగన్ పాలనలో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. వాస్తవానికి ఇందులో పూర్తి నిజం లేదు. జగన్ హయంలో 2024 మార్చి నాటికి రూ.182 కోట్ల వ్యయంతో 40 శాతం పనులను పూర్తి చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో ఆటోమేటిగ్గా ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి వెళ్లింది.
ఈ క్రమంలోనే 2024 జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. డిప్యూటీ పవన్ త్రాగునీటి సరఫరా శాఖ బాధ్యతలు చేపట్టారు. జగన్ నియోజకవర్గం కాబట్టి తనకెందుకులే అని పవన్ భావించకుండా.. పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై ప్రత్యేక చొరవ చూపించారు. జల్ జీవన్ మిషన్ కింద ఆగిపోయిన మిగులు నిధులను కేంద్రం నుంచి తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించారు. అలా దాదాపు రూ.203 కోట్ల మేర నిధులు కేటాయించి.. 56 శాతం పనులను పవన్ పూర్తి చేయించారు. ఇప్పటివరకూ 96 శాతం (రూ.385 కోట్లు) పనులు పూర్తై.. పులివెందులలోని పలు గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ కింద నీరు అందుతోంది.
క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే?
పైన లెక్కలను గమనిస్తే.. పులివెందుల మెగా గ్రిడ్ వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జగన్, పవన్ ఇద్దరి నేతల కృషి ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి క్రెడిట్ ను ఏ ఒక్కరికీ ఆపాదించలేం. అయితే జగన్ సొంత నియోజకవర్గం అని చూడకుండా.. ఎలాంటి రాజకీయ లెక్కలకు పోకుండా పులివెందుల ప్రజల దాహార్తిని తీర్చడంలో పవన్ చేసిన కృషిని మెచ్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగని జగన్ ను తక్కువ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఇంతటి బృహుత్తర ప్రాజెక్ట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది జగన్ అన్న విషయాన్ని విమర్శలు మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. మెుత్తం మీద ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. పులివెందుల చుట్టుపక్కల ఉన్న 299 గ్రామాలకు తాగునీరు అందనుండటం విశేషం.








