మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి మాజీ సీఎం జగన్ కొత్త విషయాలు చెబుతుంటారు. ఈసారి కూడా అదే చేశారు. కాకపోతే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి అంటగలిపే ప్రయత్నం చేశారు. ఆయన అరెస్టు వెనుక ముమ్మాటికీ ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.
బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలో వైసీపీ ఆఫీసులో మాట్లాడిన ఆయన, కొన్ని విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై కొత్త విషయాలు చెప్పారు. కేసులు, అరెస్టులు చేసిన నేతలను ఎప్పటి మాదిరిగానే వెనుకేసుకు వచ్చారు. కాకపోతే లిక్కర్ కుంభకోణం కేసును మరింత తక్కువ చేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం.
కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్‌ను అన్యాయంగా తప్పుడు కేసులో జైలుకు పంపించారని ఆరోపించారు. జిల్లా స్థాయిలో జరిగే టెండర్లు, కాంట్రాక్టులని, దాని వాల్యూ చాలా చిన్నదని లిక్కర్ కుంభకోణం కేసును తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అందులో ఆయన్ని ఇరికించి లిక్కర్ ట్రాన్స్‌పోర్టు పేరిట అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారని దుయ్యబట్టారు.
వాస్తవానికి లిక్కర్ కేసులో సిట్ కారుమూరి నాగేశ్వరరావు జోలికి వెళ్లలేదు. ఈడీ రంగ ప్రవేశం చేసిన తర్వాత గతంలో అరెస్టయిన నిందితులు, కొత్తగా కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకును అరెస్టు చేసింది. ఈ కేసుని జిల్లా స్థాయి టెండర్ల కేసుగా వర్ణించారు మాజీ సీఎం.
దీని వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. అసలు చెప్పాలంటే ఈడీ రంగ ప్రవేశం చేసిందంటే భారీ ఎత్తున లావాదేవీలు జరిగితే దిగుతుంది. అందులోనూ మనీ లాండరింగ్ జరిగిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయం మాజీ సీఎం బాగా తెలుసు కూడా.
ఇదేకాదు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కేసు విషయంలో ఇదే తరహా మాటలు చెప్పారు. మత్స్యకారులను ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ కమ్యూనిటీకి చెందిన అప్పలరాజును ఏదో చిన్న కేసులో అరెస్టు చేశారంటూ మీడియా ముందు గగ్గోలుపెట్టిన విషయం తెల్సిందే.








