AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. అద్భుతం చేసిన భారత సంతతి డాక్టర్..!

వైద్య రంగంలో ఇదొక అద్భుతమైన పురోగతి. కపాలం తెరవాల్సిన అవసరం లేకుండా, కేవలం ముక్కు ద్వారా మెదడులోని కణితులను (ట్యూమర్లను) తొలగించే వినూత్న శస్త్రచికిత్స విధానాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ అభివృద్ధి చేశారు. మేజర్ జగత్‌కుమార్ పటేల్ అనే ఈ సర్జన్, మరో ఆర్మీ న్యూరో సర్జన్‌తో కలిసి ఈ కొత్త పద్ధతికి రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా రోగులు అతి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉందని పెంటగాన్ వెల్లడించింది.

 

15 ఏళ్లుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న మెరైన్ స్టాఫ్ సార్జంట్ ఆండీ ఆర్చర్‌కు ఈ విధానంలో విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. కొన్నాళ్లుగా అతనికి కంటిచూపు సమస్యలు కూడా రావడంతో, ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా మెదడులో పిట్యూటరీ గ్రంథి ముందు భాగంలో 4.4 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు తేలింది. ఇది కంటి నరంపై ఒత్తిడి కలిగించడంతో సమస్య తీవ్రమైంది. దీంతో అతడిని వాల్టర్ రీడ్ ఆర్మీ నేషనల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.

 

మేజర్ జగత్‌కుమార్ పటేల్, లెఫ్టినెంట్ కల్నల్ చార్లెస్ మిల్లర్‌తో కలిసి, పుర్రె తెరవకుండా ముక్కు ద్వారానే కణితిని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. ఈ సర్జరీ కోసం ముక్కులోని సంక్లిష్టమైన భాగాల గుండా సురక్షితమైన మార్గాన్ని పటేల్ రూపొందించారు. ఆపరేషన్ సమయంలో పటేల్ ఎండోస్కోపిక్ కెమెరాను ఉపయోగించి కణితిని హై-డెఫినిషన్‌లో స్పష్టంగా చూపిస్తుండగా, మిల్లర్ దానిని జాగ్రత్తగా కత్తిరించి బయటకు తీశారు.

 

“గతంలో ఇలాంటి సర్జరీల కోసం పుర్రెను తెరవాల్సి వచ్చేది. ఇది రోగికి చాలా సవాలుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు ట్యూమర్ సరైన పరిమాణంలో, సరైన ప్రదేశంలో ఉంటే ఓపెన్ సర్జరీ అవసరం లేదు. ముక్కు ద్వారానే కణితిని పూర్తిగా తొలగించడానికి ఉత్తమమైన అవకాశం లభిస్తుంది. ఇది ఒక నిజమైన టీమ్ ఎఫర్ట్” అని మేజర్ పటేల్ వివరించారు.

 

సర్జరీ జరిగిన రెండు రోజులకే ఆర్చర్ కోలుకోవడం ప్రారంభించాడు. ఆపరేషన్ జరిగిన ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించలేదు. అతను సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో కూర్చోగలిగాడు, అతని కంటిచూపు కూడా మెరుగుపడటం ప్రారంభించింది. ఇలాంటి సంక్లిష్టమైన సర్జరీలు చేసే బృందం డిఫెన్స్ హెల్త్ ఏజెన్సీలోనే మరొకటి లేదని పటేల్ గర్వంగా తెలిపారు.

ANN TOP 10