AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక..!

భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాక‌రతో టెలిఫోన్‌లో మాట్లాడి.. గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

 

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్న దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కూడా భాగ‌స్వాములుగా చేయాల‌ని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు.

 

అటు పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

 

మరోవైపు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రాజెక్టుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంత ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

 

ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాచలం వద్ద మూడ‌వ ప్ర‌మాద‌హెచ్చ‌రిక జారీ చేసినట్లు ఈ సందర్భంగా మంత్రికి కలెక్టర్ తెలియజేశారు. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో నీటి మట్టం మధ్యాహ్నానికి ఏకంగా 48 అడుగులకు చేరుకుంద‌ని తెలిపారు. దీంతో 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామ‌ని మంత్రికి కలెక్టర్ వివరించారు.

ANN TOP 10