విశాఖపట్నం సిటీలో దారుణ ఘటన బయటపడింది. ఓ యువతిని ప్రేమించాడు.. ఆ తర్వాత లోబరుచుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆ యువతిని చంపేశాడు. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి ఒడిషాలో తీసుకెళ్లి పడేశాడు. సంచలనం రేపిన ఈ ఘటనలో రాత్రి నిందితుడ్ని ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎలా జరిగింది?
అసలు ఏం జరిగింది?
విశాఖ సిటీ కంచరపాలెంలోని దుర్గానగర్‌కు చెందినవాడు ఆటో డ్రైవర్ సురేష్. ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య ప్రెగ్నెంట్ అయ్యింది. సీన్ కట్ చేస్తే.. అదే సమయంలో రైల్వేస్టేషన్ వద్ద ఓ యువతితో సురేష్‌కు పరిచయం ఏర్పడింది. ఆ యువతితో మాటలు కలిపాడు. తనకు ఎవరూ లేరని చెప్పడంతో తన భార్యకు సాయంగా ఉండాలని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సురేశ్-యువతి మధ్య రిలేషన్ మరింత బలపడి వారిద్దరు ఒక్కటయ్యారు.
పాప పుట్టిన తర్వాత సీన్ రివర్స్
మార్చి 24న సురేష్‌కు పాప పుట్టిన విషయం యువతికి తెలిసింది. అప్పటి నుంచి తనను వివాహం చేసుకోవాలని సురేష్‌పై ఒత్తిడి తెచ్చింది. తనను పెళ్లి చేసుకోకుంటే ఇద్దరి మధ్య సంబంధాన్ని ఇంట్లో చెబుతానని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సురేష్-సదరు యువతి మధ్య గొడవ జరగడంతో కొన్నిరోజులు దూరంగా ఉన్నారు.
యువతిని చంపి సూట్ కేసులో కుక్కేశాడు
జూలై 15న సురేష్ ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ గొడవ చేసింది యువతి. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. యువతిని కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆధారాలు మాయం చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. హత్య విషయం బయటకు వెళ్లకుండా ఉండేందుకు యువతి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేశాడు. కంచరపాలెం నుంచి జ్ఞానాపురం రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అక్కడ రాయగడ్‌కు వెళ్లే ట్రైన్ ఎక్కాడు. సాయంత్రం 6.30 గంటలకు రాయగడ చేరుకుంది రైలు. స్టేషన్ నుంచి కూతవేటు దూరంలోకి వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్‌ని పడేశాడు సురేష్.
పోలీసుల విచారణ ఎలా సాగింది?
మళ్లీ రైలెక్కి రాత్రి ఇంటికి చేరుకున్నాడు. తనను ఎవరు పట్టుకోలేరని భావించాడు. మూడు రోజుల తర్వాత ట్రాలీ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహం స్థానికులది కాకపోవడంతో యువతి మృతదేహాం గుర్తించేందుకు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ సురేష్ ఫోన్ నెంబర్ గుర్తించారు. అతడే నిందితుడని నిర్థారించుకున్నారు. రాయఘడ్ నుంచి నేరుగా కంచరపాలెం స్టేషన్ కు వచ్చారు. అక్కడి పోలీసుల సహకారంతో సురేష్‌ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. పై విషయాలను పోలీసులు వెల్లడించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.








