లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కోల్కతాలో వెలసిన పోస్టర్లు రాజకీయంగా కలకలం రేపాయి. నగరంలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉదయం ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా రాహుల్ గాంధీ నిద్రపోతున్నట్లుగా ఉన్న చిత్రాలను ముద్రించి, “దేశ్ కీ నేతా ఐసా హో? (దేశ నాయకుడు ఇలాగేనా ఉండేది?)” అనే నినాదాన్ని వాటిపై జోడించారు. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అంటించారనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఏ వ్యక్తి గానీ, సంస్థ గానీ దీనికి బాధ్యత వహించలేదు.
ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు వేర్వేరు చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రంలో, ఆయన పార్లమెంట్లో చెంపలకు చేతులు ఆనించుకుని కళ్లు మూసుకుని ఉండగా, మరో చిత్రంలో సీటులో వెనక్కి వాలి కూర్చుని ఉన్నారు. ఈ చిత్రాల ద్వారా, రాహుల్ సభా కార్యక్రమాల సమయంలో నిద్రపోతున్నారని చెప్పే ప్రయత్నం జరిగింది.
దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు (ఎస్ఐఆర్) వ్యతిరేకంగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఢిల్లీలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
మరోవైపు, బీజేపీ దేశవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకత్వాన్ని తొలగించండి’ పేరుతో కౌంటర్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం కోల్కతాలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలన నుంచి విముక్తి లభించినట్లే, ఢిల్లీకి కూడా రాహుల్ గాంధీ నుంచి త్వరగా విముక్తి కలగాలని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం సిలిగురిలో జరిగిన ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి అక్రమ చొరబాటుదారులను తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంటే, వారిని కాపాడేందుకు మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.








