ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ పేదల ఇళ్ల కల నెరవేర్చడంతో పాటు రైతులకు మరింత మేలు చేకూర్చేందుకు సహాయం అందించాలని కోరారు.
పీఎంఏవై 2.0 కింద ఇళ్ల కేటాయింపు
గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీలో అదనపు పనులు
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు వీలుగా 10 కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల పెంపకం, మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు.
భూముల అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల అనుసంధానం
రైతుల భూములను మరింత సారవంతం చేయడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న భూములను పునరుద్ధరించే పనులను కూడా ఈ జాబితాలో చేర్చాలని సీఎం ప్రతిపాదించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్ల’ నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పథకం కింద 90 రోజుల పని కల్పించి, వారికీ ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.








