AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెన్సార్ బోర్డుపై రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్..!

కాంట్రవర్సీ మాటలతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొనే రామ్ గోపాల్ వర్మ మొన్నా మధ్య పోలీస్ కేసులు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమధ్య మళ్లీ వార్తల్లో నిలిచేలా సంచలన కామెంట్లు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.ఇప్పుడు ఏకంగా భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా డిమాండ్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

 

సెన్సార్ రూల్స్ ప్రేక్షకుడిని అవమానించినట్టే..

ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ పోస్టులో ఇలా రాసుకొచ్చారు. “డిజిటల్ యుగంలో కూడా సినిమాలపై సెన్సార్ విధించడం అనేది ప్రేక్షకులను అవమానించడం తప్పా మరొకటి కాదు” అంటూ తన పోస్టులో తీవ్రంగా విమర్శించారు. “స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు, సోషల్ మీడియా, అంతర్జాతీయ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్న ఈ కాలంలో.. పెద్దలు ఏ సినిమా చూడాలో ఒక కమిటీ నిర్ణయించడం అనేది కేవలం పాత ఆలోచన మాత్రమే.. దేశ నాయకుడిని ఎన్నుకునేంత బాధ్యత ఉన్న 18 ఏళ్ల యువకుడికి ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఒకవైపు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఇచ్చి, మరోవైపు సినిమా విషయంలో ప్రేక్షకులపై నమ్మకం లేకపోవడం విరుద్ధమైన వైఖరి. సినిమా అనేది దర్శకుడు దృక్పథాన్ని ప్రతిబింబించే కళారూపం.. దాన్ని అంగీకరించాలా? వద్దా ? అనేది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయం.

 

కత్తెర కంటే నిర్ణయించే హక్కు ప్రేక్షకుడికి ఇవ్వాలి..

థియేటర్లలో కొన్ని సన్నివేశాలను కత్తిరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.అవే సన్నివేశాలు సోషల్ మీడియా వంటి వేదికల ద్వారా గంటలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నిజానికి సెన్సార్ కత్తెర వేయడం వల్ల కంటెంట్ సినిమా నుంచి తొలగించబడినా.. అదే కంటెంట్ సోషల్ మీడియా మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అవుతోంది . పిల్లలు కూడా నిత్యం హింసాత్మక వార్తలు, వివిధ రకాల ఆన్లైన్ కంటెంట్ చూస్తున్న ఈ కాలంలో కేవలం సినిమాలపై ఇలాంటి పరిమితులు విధించడం ఎంతవరకు కరెక్ట్ ? అంటూ ప్రశ్నించారు. సినిమా అనేది సమాజంలోని అంశాలపై చర్చకు దారి తీసే శక్తివంతమైన మాధ్యమం.. అలాంటి కళారూపాన్ని నియంత్రించడం స్ఫూర్తికి విరుద్ధం.. నిర్మాతలు, దర్శకులు ఇకపై సెన్సార్ బోర్డు విధించే అనవసరమైన కోతలను అంగీకరించకుండా.. అందరూ ఒకే తాటి పైకి రావాలి అంటూ తన పోస్టులో పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రస్తుతం సెన్సార్ బోర్డు వ్యవస్థను.. కోర్టులోనూ , ప్రజా చర్చల్లోనూ సవాలు చేయాల్సిన సమయం వచ్చిందని.. సినిమాలకు కత్తెరలు విధించడం కంటే అందులోని అంశాలపై స్పష్టమైన సమాచారం ఇచ్చి చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేయాలి.. అంటూ #BanTheCensor అనే హ్యాష్ ట్యాగ్ తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వర్మ.

ఇక వర్మ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా మూవీ రక్త చరిత్ర సినిమా రీరిలీజ్ కి సిద్ధమవుతోంది. మరొకవైపు హిందీలో పోలీస్ వ్యవస్థను సవాల్ చేస్తూ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే వర్మ చేసిన పోస్ట్ కాస్త ఆలోచించదగినదే అయినా..వర్మ అభిప్రాయాలపై సినీ పెద్దలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ANN TOP 10