AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం..! కోర్టు సంచలన తీర్పు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఓ కేంద్ర మంత్రి రాజీనామాకు కారణమైన నీట్​ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులోని 14మంది నిందితులపై ఆరోపణల ఖరారుపై ఢిల్లీ రౌస్​ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులను రిజర్వ్​ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్​ వినోద్​ దివాకర్​ ఈ అంశంపై వచ్చేనెల 18న ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.

క్రితంసారి నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీపై కాక్రోచ్​ జనతా పార్టీ, కాంగ్రెస్​ తోపాటు వేర్వేరు రాజకీయ పక్షాలు ఢిల్లీ వేదికగా ఉధృత ఆందోళనలు జరిపాయి. దాంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, కేసు తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన సీబీఐ జూలై నెలలో 13మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టులో మొదటి ఛార్జ్​ షీట్ దాఖలు చేసింది.

అనంతరం 14వ నిందితునిగా శేషారావు బజరంగ్​ సూర్యవంశీ పేరును చేర్చి అదనపు ఛార్జ్​ షీట్ ను సమర్పించింది. వీటిని కోర్టు ఆగస్టులో పరిగణలోకి తీసుకుంది. కాగా, నిందితులపై మోపిన ఆరోపణలను పరిశీలించి వారిపై క్రిమినల్ విచారణ ప్రారంభించడానికి ఆధారాలు ఉన్నాయా? లేదా? అన్నదానిపై నవంబర్ 18న కోర్టు స్పష్టత ఇవ్వనుంది. కోర్టు నిందితులపై మోపిన నేరాభియోగాలను ఖరారు చేస్తే వారిపై అధికారికంగా కోర్టు విచారణ ప్రారంభమవుతుంది

ANN TOP 10