మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ క్యాబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు.రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోంది. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ‘డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ’ తో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. ఇకపై పాత విధానంలో కొనుగోళ్లు కాకుండా కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే ధాన్యం కొనుగోళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడానికి చేతకాదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నాడని పేర్కొన్నారు. పంటలు కొనుగోలు చేయమని తమ చేతగాని తనాన్ని రాష్ట్ర క్యాబినెట్ మీడియా సాక్షిగా ఒప్పుకున్నది.
ఏడు రకాల సన్నాలే సాగు..
రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనకపోతే, పండిన పంటను రైతులు ఏం చేయాలి? ఇంట్లో దాచుకోవాలా? రైతుల బతుకులతో ఆడుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?కేంద్ర కోటాల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమే.. అని ఆవేదన వ్యక్తం చేశారు. పంట బోనస్ రావాలంటే ఏడు రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగు పై ఆంక్షలు విధించడమేనన్నారు. పంట మార్పిడి చేయండి అన్న మీ మాటలు నమ్మి జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, శనిగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందన్నారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేస్తే, మిగతా 1.20 లక్షల క్వింటాళ్ల పంట మిగిలిపోయిందన్నారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500 కే రైతులు అమ్ముకుంటున్నారన్నారు. మొక్కజొన్న విషయంలో 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను వల్ల మక్క రైతులు దిక్కు తోచని స్థితికి వెళ్లారన్నారు.
ముందస్తు చర్యలు తీసుకోలేదు?
Advertisement
ఇప్పుడు వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిస్తే రైతుల బతుకులు ఆగం అవుతాయన్నారు. కేసీఆర్ రైతన్నను రాజుగా చేస్తే, రేవంత్ రెడ్డి దివాళా తీసే కుట్రలు చేస్తున్నాడన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ రైతుకు తీరని ద్రోహం చేస్తున్నడన్నారు. ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి, ఇప్పుడు రైతులకు “నీళ్లు లేవు కాబట్టి పంటలు చూసుకుని వేయండి” అని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై త్రి సభ్య కమిటీ సమావేశానికి ముందే తెలంగాణలో నీటి కొరత ఉందని, ఏపీ ఇప్పటికే అధికంగా నీటిని తరలించిందని లేఖలు రాసినా మళ్లీ 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారు?
ఎల్ ని నో పేరుతో..
Advertisement
ఒకవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని చెబుతూ, మరోవైపు ఏపీకి నీళ్లు అప్పగించడం తెలంగాణ రైతాంగానికి చేసిన ద్రోహం కాదా?రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పని చేసి, ఎల్ ని నో పేరు తో తప్పించుకునే ప్లాన్ వేయడం సిగ్గుచేటు అన్నారు. నీటి నిర్వహణలో ప్రభుత్వ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే మంత్రులు ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారా?..ఏపీకి నీటిని వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతులపై బాధ్యత నెట్టివేయడం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం అన్నారు. సాకులు, సమస్యలు అంటూ పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు అని హెచ్చరిస్తున్నాం అన్నారు. లేకపోతే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం అన్నారు. పంటల కొనుగోళ్లపై రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంఅన్నారు.
మరోసారి బహిరంగ సభ..
ధాన్యం కొనుగోళ్లపై “డిజిటల్ క్యాబినెట్” పేరుతో తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా విడుదల చేయడానికి బహిరంగ సభలు ఎందుకు? గత యాసంగిలో రెండు సభలు పెట్టి రెండెకరాలకు వేసి చేతులు దులుపుకొని, ఇప్పుడు మరోసారి బహిరంగ సభ పెట్టి రైతుభరోసా వేస్తామనడం హాస్యాస్పదం అన్నారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులతో పాటు, గతంలో పెండింగ్‌లో ఉంచిన మూడు విడతల రైతు భరోసా బకాయిలు మొత్తం 16,545 కోట్లు ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.








