AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామాయణంపై వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు..

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో సోమవారం క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేత, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు.

 

తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌తో పాటు పలు బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై (లంకగా పోలుస్తూ) దండయాత్ర చేశారని, ఇది ఆర్యుల-ద్రావిడుల విభజనను ప్రోత్సహించేలా ఉందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించినట్లు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

 

ఈ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా ఉండటమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా మరియు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో వివరించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023లోని సెక్షన్ 299, 196 కింద కేసు నమోదు చేసి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

సామాజిక మాధ్యమాల్లో ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియో ఏప్రిల్ 17న తన దృష్టికి వచ్చిందని భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడి గురించి ఆయన మాట్లాడిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. సమాజంలో విద్వేషాలు రగిల్చేలా, హిందూ దేవతలను మరియు పవిత్ర గ్రంథాలను నిందితుడు ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

గతంలో ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఏప్రిల్‌లోనే భానుప్రకాశ్ రెడ్డి ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తాజాగా ఆయన చేసిన ఫిర్యాదును తిరుపతి కోర్టు విచారణకు స్వీకరించింది.

ANN TOP 10