AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..!

పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ హైడ్రోజన్ రైలును నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ‌ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికోసం 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీలో హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. దీంతో సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం పూర్తిగా ఉండదు. ఈ చొరవతో హైడ్రోజన్ టెక్నాలజీని రైల్వే రంగంలో పరీక్షిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది.

 

హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. రైలుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనాన్ని నింపేందుకు జింద్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రీఫ్యూయలింగ్, నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ నిల్వ, పంపిణీ కోసం పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) నుంచి అవసరమైన లైసెన్సు కూడా లభించింది.

 

ప్రయాణికుల భద్రతకు రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జింద్‌లోని రీఫ్యూయలింగ్ కేంద్రంలో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లతో సహా పలు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు. రైలు నిర్వహణ కోసం షకుర్‌బస్తీలో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో కూడా కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నారు. ఆర్‌డీఎస్‌వో ఆమోదించిన నిబంధనల ప్రకారం రైలు నిర్వహణ జరుగుతుందని, శిక్షణ పొందిన సిబ్బంది 24 గంటల పర్యవేక్షణలో ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రారంభ దశలో రైలుతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా ప్రయాణించి, పనితీరును పర్యవేక్షిస్తారు.

 

ఈ ప్రాజెక్టు ద్వారా ఆవిష్కరణలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ హిత రవాణా పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నామని భారత రైల్వే తెలిపింది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి, నెట్-జీరో లక్ష్యాలను చేరుకునేందుకు ఈ హైడ్రోజన్ రైలు ఎంతగానో దోహదపడనుంది.

ANN TOP 10