తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీని ఒక్కరోజైనా గడవలేదు. నిమిషాల వ్యవధిలో అప్పుడే అధికార టీవీకే-విపక్ష డీఎంకె మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఓ వైపు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు విరుచుకుపడ్డారు మాజీ సీఎం స్టాలిన్. ఇంతకీ ఏ విషయంలో తెలుసా?
తమిళనాడులో అప్పుడు రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీవీకే చీఫ్ విజయ్. ముఖ్యమంత్రిగా తొలి స్పీచ్‌లో తాను ఏమి చేస్తానో చెప్పడమేకాకుండా, ప్రతిపక్షంపై కాసింత రుసరుసలాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తనకు కొంత సమయం కావాలని చెప్పిన సీఎం విజయ్, గతంలో ఉన్న డీఎంకె ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందన్నారు.
అదే సమయంలో 10 లక్షల కోట్ల అప్పు ఉందని, త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పకనే చెప్పారు. సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు మాజీ సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీల నుండి తప్పుకునే ఆలోచన చేయవద్దు-డీఎంకె
మీరు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన ప్రకటనలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని అనవద్దని, ఖజానా లేదని చెప్పకండి అన్నారు. రాష్ట్ర ఖజానా గురించి తెలియకుండానే ఎన్నికల్లో అన్ని హామీలు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుండి తప్పుకునే ఆలోచన చేయవద్దని హితవు పలికారు.
ప్రజలకు నిధులు ఇవ్వాలనే సంకల్పం ఉంటే తమిళనాడులో నిధులు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తెలుసుకునే కొత్త ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు ఇచ్చారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రారంభోపన్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు స్టాలిన్. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రుణ భారాన్ని వదిలి పెట్టిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు.
డీఎంకే ప్రభుత్వ పనితీరును సమర్థిస్తూ ఐదేళ్లలో మా ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు. ఓవైపు కోవిడ్, మరోవైపు వరదలు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి సవాళ్లను ప్రస్తావించారు. ఐదేళ్లపాటు తాము ప్రజలకు లెక్కలేని సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఆర్థిక వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయన రాష్ట్ర అప్పును ఎందుకు ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ ప్రశ్నించారు.
ఫిబ్రవరి బడ్జెట్‌లో తమిళనాడు ఆర్థిక పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పామని, ఆ విషయం మీకు తెలీకుండానే ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. చివరలో తమిళనాడు అభివృద్ధి కొనసాగాలని ప్రస్తావిస్తూ మరోసారి సీఎం విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.








