ఏపీలో కూటమి ప్రభుత్వం బీటలు వారుతోందని వస్తున్న ఊహాగానాలకు సీఎం చంద్రబాబు చెక్ పెట్టారు. తమ మధ్య అటువంటి మనస్పర్దలు లేవని చిన్న సంకేతంతో వారికి క్లారిటీ ఇచ్చారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరి రెండేండ్లు పూర్తయ్యింది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, పెట్టుబడుల సమస్య, కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటున్నా రాజధాని అమరావతి ఇంకా నిర్మాణదశలోనే ఉన్నది. మరోవైపు నిరుద్యోగ సమస్య సైతం రాష్ట్రంలో పెరిగిపోతోంది. సిక్స్ గ్యారెంటీస్ ఎక్కడా అని ప్రతిపక్ష వైసీపీ కూటమి సర్కారును నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నది. మరోవైపు పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు కామన్ అయ్యాయి. ఓవైపు జనసేన, మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సఖ్యత ఉండటం లేదని, ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నట్టు సమాచారం.
పొత్తు పార్టీల్లో పంచాయితీ..
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌వీఎన్ఎస్ వర్మ, స్థానిక జనసేన నేతలకు అస్సలు పడటం లేదు. వాస్తవానికి పిఠాపురంలో వర్మ గత ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి వచ్చింది. దాంతో ఆయనకు టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపించింది. ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన పవన్ గెలుపుకోసం పనిచేయాల్సి వచ్చింది. నాటి నుంచి ఆయన అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఆయన్ను ప్రస్తుతం పెద్దగా పట్టించుకోకపోవడంతో మరింత అసహనంతో ఉంటున్నట్టు సమాచారం.
ఫొటో పంచాయితీ సీరియస్..
ఇటీవల జనసేన స్థానిక లీడర్లు పిఠాపురంలో నిర్వహించిన ఓకార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోతో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రయివేటు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో వేయకపోయినా పర్లేదు. అది పార్టీ వరకే ఉండేది. కానీ,ప్రభుత్వ కార్యక్రమంలో జనసైనికులు కేవలం డిప్యూటీ సీఎం పవన్ ఫొటో ఏర్పాటుచేశారు. అందులో సీఎం చంద్రబాబు ఫోటో లేదు. అదే సమయంలో అక్కడకు వచ్చిన వర్మ.. అధికారులు, జనసేన లీడర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న ఓ జనసేన నేత వర్మను కొట్టడానికి దూసుకొచ్చారు. జనసైనికులు ఆపడంతో అది కాస్త సర్దుమనిగింది. ఇదే విషయం అధిష్టానం వరకు వెళ్లింది. పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా వర్మ వ్యవహరిస్తున్నారని టీడీపీ సైతం ఫైర్ అయ్యింది. ఎందుకంటే ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు.
తాజాగా వర్మను పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పింది. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాలోకేశ్‌ను కలిసిన రెండ్రోజుల్లో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో వర్మ షాక్‌లో ఉన్నారు.ఆయన స్థానంలో మరొకరిని ఏర్పాటు చేసేందుకు పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం.పవన్ ఒత్తిడి మేరకు టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నదా? తెలియరాలేదు. ఎందుకంటే వర్మ చేస్తున్న పనుల వలన అటు పవన్.. ఇటు చంద్రబాబు మధ్య చెడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సీట్లు తీసుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి విశేషంగా కృషి చేశారు. ఈ విషయాన్నిచంద్రబాబు సైతం పలుమార్లు గుర్తుచేశారు. అందుకే వర్మ విషయంలో బాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తెగేదాక వర్మనే లాగారని టాక్. దీంతో పిఠాపురం పూర్తిగా జనసేనదే అని శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.








