దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీలు, కంపెనీలకు ఇచ్చే రాయితీల నేపథ్యంలో వ్యాపారవేత్తల దృష్టి ఏపీపై పడింది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రాయిల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ ప్లాంట్ రానుంది.
ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలు భారీ పెట్టుబడులతో రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రాగా, రేపో మాపో సత్యసాయి జిల్లాలో జెట్ విమానాల తయారీ పరిశ్రమ రాబోతోంది. ఇదే సమయంలో భారతదేశపు స్వదేశీ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కార్యకలాపాలను విస్తరించే పనిలో పడింది.
1955 లో తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తొలిసారి ఆ రాష్ట్ర అవతల ముఖ్యంగా దక్షిణాదిలో ప్లాంట్ విస్తరిస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తిరుపతి జిల్లాలోని సతీవేడులో సుమారు రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ఓ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇటీవలి కాలంలో ఏపీలో ప్రకటించిన అతిపెద్ద పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి.
ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు 267 ఎకరాలను కేటాయించింది. ప్రాజెక్టు తొలి దశ 2029 నాటికి పూర్తి అవుతుందని అంచనా. రెండవ దశ 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ కంపెనీ. కేవలం ఒక తయారీ యూనిట్ మాత్రమేకాదు, దీర్ఘకాలిక ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
రూ. 2,200 కోట్లతో పెట్టుబడి.. 3 వేల మంది ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని ఓ అంచనా. ఈ ప్లాంట్ కార్యకలాపాలు మొదలైన తర్వాత అనుబంధ పరిశ్రమలు, సరఫరాదారులు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు, చిన్న తయారీ యూనిట్లు కూడా రానున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకోవడం వెనుక ఎంచుకోవడం కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు దగ్గరగా ఉంటోంది. దీనికితోడు ఏపీలో ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఆటోమొబైల్ రంగంలో ఈవీ తయారీదారులకు బలమైన సందేశాన్ని పంపినట్లయ్యింది. కొత్త ప్లాంట్ ద్వారా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9 లక్షల వాహనాలకు పెరగనుంది.
దేశీయ మార్కెట్‌లో 88 శాతం వాటాను కలిగి ఉన్నరాయల్ ఎన్‌ఫీల్డ్, భారీ లక్ష్యాలతో భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడున్న తమిళనాడు రాజకీయాలు, ఏపీలో పరిశ్రమల ప్రొత్సహాకాలు నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏపీ వైపు మొగ్గు చూపిందని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. తయారీ రంగం బలంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పోటీ పడటానికి ప్రయత్నాలు చేస్తోంది ఏపీ.
ఈ ప్రాజెక్టు అనుకున్నట్లుగా జరిగితే మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలకు ఏపీ కేరాఫ్‌గా మారడం ఖాయమనే వాదన సైతం లేకపోలేదు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. దీంతో క్యారియర్ గ్లోబల్ ఎయిర్ కండిషనర్ ప్లాంట్, హ్వాసెంగ్ వారి స్పోర్ట్స్ షూ తయారీ కంపెనీలను ఏపీ ఆకట్టుకుంది.
ప్రోత్సాహకాల్లో మూలధన రాయితీలు, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు వంటివి ఉంటాయని తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి తమిళనాడులో బలమైన ఆర్థిక పునాదులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కొన్నాళ్లు తప్పదని పారిశ్రామిక వేత్తల అంచనా.








