AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫలితాల ముందు..! సీఎం మమతా కీలక నిర్ణయం కౌంటింగ్ ఏజెంట్లతో అత్యవసర భేటి..!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ.. రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి ఇవాళ (మే 2వ తేదీ) సాయంత్రం పార్టీ కౌంటింగ్ ఏజెంట్ల అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఈ భేటి.. వర్చువల్ విధానంలో జరుగుతుందని టీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని 291 నియోజకవర్గాలకు చెందిన టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, టీఎంసీ మిత్ర పక్షమైన బీజీపీఎం నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

భేటి ఎందుకుంటే?

మే 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం మమతాతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రం నుంచి గెలుపు సర్టిఫికేట్ తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని కఠిన ఆదేశాలు జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈవీఎంలు ఓపెన్ చేసేటప్పుడు, రౌండ్ల వారీగా లెక్కింపు జరిగేటప్పుడు ఏవైనా పొరపాట్లు జరిగితే వెంటనే పార్టీ అగ్రనాయకత్వానికి సమాచారం అందించాలని ఈ భేటిలో సూచించే ఛాన్స్ ఉంది. అలాగే ఈసారి కొత్తగా ఈసీ ప్రవేశపెట్టిన కౌంటింగ్ ప్రక్రియ, క్యూఆర్ కోడ్ వంటి అంశాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించనున్నారు.

 

ఫలితాలపై దీదీ టెన్షన్!

ఇటీవల బెంగాల్ రెండోదశ పోలింగ్ సందర్భంగా తాను బరిలో నిలిచిన భవానీపూర్ నియోజకవర్గంలో మమతా పర్యటించారు. ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం.. బయటకొచ్చి సంచలన వ్యాఖ్యలుచేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఓటింగ్ ను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ సందర్భంగానూ అక్రమాలు జరగొచ్చని మమతా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లతో భేటి నిర్వహించి.. చివరి ఓటు లెక్కతేలే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించనున్నారు.

 

విజయం మాదే: టీఎంసీ వర్గాలు

ఇదిలా ఉంటే బెంగాల్ లో మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికారం చేపట్టేందుకు 148 స్థానాలు అవసరం. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో.. బీజేపీ, టీఎంసీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తేల్చేశాయి. పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్, పీ మార్క్, చాణక్య స్ట్రాటజీస్, పోల్ డైరీ వంటి సంస్థలు.. బీజేపీ అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. పోల్ ఆప్ ఎగ్జిట్ పోల్స్ తదితర సంస్థలు టీఎంసీపై మెుగ్గు చూపాయి. మెుత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. తాము భారీ విజయం సాధిస్తామని టీఎంసీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ANN TOP 10