రాష్ట్రంలోని ఆలయాల్లో వర్తకుల గుత్తాధిపత్యం నడుస్తుంది. వారికి ఆలయ అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే బహిరంగ టెండర్ వేయాల్సి ఉన్నప్పటికీ పలు ఆలయాల్లో వేయడం లేదని.. టెండర్ల గడువు ముగియడానికి మూడు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయాలకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. శాఖ మంత్రి సైతం ఓ ఆలయంపై వస్తున్నఆరోపణలపై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని కోరిన ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది. అంటే అధికారులు ఏమేరకు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారనేది స్పష్టమవుతోంది.
టెండర్లు వేయటం మరిచారా..?
రాష్ట్రంలో ప్రధాన ఆలయాలు 704 ఉన్నాయి. ఆ ఆలయాల పరిధిలో మండిగలు(దుకాణ సముదాయాలు) ఉంటాయి. వీటిని టెండర్ల రూపంలో, బహిరంగ వేలం పాట ద్వారా వేలం వేసి ఎవరు ఎక్కువగా పాడితే వారికి ఇస్తారు. అయితే వీటితో ఆలయాలకు ఆదాయం వస్తుంది. అయితే ఏ ఆలయం పరిధిలోని దుకాణాలు అయినా టెండర్ గడువు మరో 3 నెలల్లో ముగుస్తుందనే సమాచారంతో టెండర్ నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు 6(ఏ) పరిధిలోని ఆలయాల్లో సైతం వేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం దేవస్థానికి చెందిన కొంతమంది అధికారులు టెండర్ దారులతో కుమ్మక్కు కావడమేననే విమర్శలు వస్తున్నాయి. టెంకాయలు, సెల్ ఫోన్, భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాలు, ఇలా పలు టెండర్లకు నోటిఫికేషన్ వేయడం లేదనే ప్రచారం జరుగుతుంది. దీంతో టెండర్ గడువు ముగిసినా, కొన్ని ఆలయాల్లో ముగుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపనలు వస్తున్నాయి. ఆలయాలకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయంకు ఉద్యోగులే గండికొడుతున్నట్లు స్పష్టమవుతోంది.
టెండర్లలో గోల్ మాల్..
ఓ ఆలయానికి సంబంధించిన టెండర్లలో గోల్ మాల్, భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాలు సేకరించే టెండర్లు కాలపరిమితి పొడిగించేందుకు టెండర్ దారుని దరఖాస్తుపై, టెండర్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు అందగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం అందుకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది. ఆలయాలకు వచ్చే ఆదాయంను రాకుండా టెండర్ దారులపై ఆలయ ఉద్యోగులు కుమ్మక్కు అవుతున్న దానిపై మంత్రి ప్రత్యేక దృష్టిసారించాలని, ఆలయ అధికారులపై సైతం పర్యవేక్షణ చేయాలని, టెండర్లలో అక్రమాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
వెనుక ఉన్న మర్మమేంటో..?
అందులో భాగంగానే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొందరు దుకాణాలదారులు చక్రం తిప్పుతున్నారని, ఓపెన్ టెండర్లు వేయకుండా నామమాత్రపు అద్దెలతో కొందరికే లబ్ధి చేకూరుస్తుండగా, దేవాదాయశాఖ ఆదాయానికి గండి పడుతోందని సమాచారం. వర్తక సంఘం ఆధిపత్యం, మరోవైపు వారికి అధికారులు సహకారిస్తుండటంతోనే ఆలయానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందనే ఆరోపణలువస్తున్నాయి. కొండపై ఉన్న సెల్ ఫోన్ కౌంటర్ టెండర్ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ. 2 కోట్ల 22 లక్షల ఆదాయం సమకూరుతోంది. కానీ, వర్తక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 10 కీలక దుకాణాలకు సంబంధించి దేవస్థానానికి చెల్లిస్తోంది కేవలం రూ. కోటీ 68 లక్షలు మాత్రమే.. దీంతో ఒక చిన్న కౌంటర్ నుంచి వచ్చే ఆదాయం కంటే 10 పెద్ద దుకాణాలు ఇచ్చే ఆదాయం తక్కువగా ఉండడం వెనుక ఉన్న మర్మమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
స్ధారికుల ఉద్యోగాలు ఏక్కడ..?
ఇదెలా ఉంటే కొండపై ఉన్న 112 తాత్కాలిక దుకాణాల్లో ప్రస్తుతం 10 దుకాణాలు వర్తక సంఘం పేరిటే కొనసాగుతున్నట్లు సమాచారం. వీటికి మే 31 నాటికి గడువు ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు టెండర్ నోటీపికేషన్ వేయలేదని సమాచారం. కాగా, ఈ దుకాణాలు ఎప్పుడూ ఒకే వర్గం లేదా కొందరి చేతుల్లోనే ఉండడం వల్ల కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు దక్కడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా కొత్త టెండర్లు పిలిచి అందరికీ అవకాశం కల్పిస్తే దేవస్థానానికి రూ. 20 నుంచి రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, దేవాదాయ శాఖ అధికారులు మాత్రం టెండర్ నోటిఫికేషన్ గడువు ముగుస్తుందని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని చెప్తున్నారు







