నందమూరి బాలకృష్ణ తన జోరును కొనసాగిస్తున్నారు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన, తన తదుపరి చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న బాలకృష్ణ, ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో పనిచేయబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఖరారైంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యువ దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, కొరటాల శివ వినిపించిన కథాంశానికి బాలయ్య పూర్తిస్థాయిలో కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
‘అఖండ’తో మొదలుపెట్టి ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య, అరవై ఏళ్లు దాటినా కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు కొరటాల శివ తనదైన ప్రత్యేక శైలితో ఇండస్ట్రీలో నిలిచారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్లతో కమర్షియల్ హంగులతో పాటు బలమైన సందేశాన్ని ఇవ్వడంలో ఆయన దిట్ట. ‘ఆచార్య’తో కాస్త తడబడ్డా, ‘దేవర’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు.
మాస్ పల్స్ తెలిసిన బాలకృష్ణ ఇమేజ్‌కి, హీరోను పవర్‌ఫుల్‌గా చూపిస్తూనే కథలో సందేశాన్ని మిళితం చేసే కొరటాల మార్క్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌పై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో బాలకృష్ణను కొరటాల ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.








