ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న ఘర్షణలు, దాడులకు సంబంధించి పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను నిందితులుగా చేర్చడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారితీయడం తెలిసిందే.
వివరాల్లోకి వెళితే, పెనుమక గ్రామానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా, పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో తాడేపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు పెట్టారు. మరోవైపు, తమ కార్ల అద్దాలను ధ్వంసం చేశారంటూ వైసీపీ నేత నారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీడీపీ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న రైతుల ఆహ్వానం మేరకే తమ పార్టీ నేతలు, సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు శనివారం ఉండవల్లి, పెనుమక గ్రామాల్లో పర్యటించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులపై ఒత్తిడి తెస్తున్నారని, వారి పొలాల చుట్టూ మట్టి తవ్వేసి సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు తమ నేతలు, రైతులపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని, పలు వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ ఘర్షణలో పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో కొంతమంది పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయని ప్రతిపక్షం తెలిపింది.
ప్రభుత్వంపై బొత్స ఫైర్
ఈ ఘటనపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదివారం విశాఖపట్నంలో తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మద్దతుతో కాకుండా పోలీసులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.
“స్థానికుల ఆహ్వానం మేరకే మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు పెనుమక వెళ్లారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. వారు వెళ్తుండగా టీడీపీ గూండాలు కాన్వాయ్‌ను అడ్డుకుని దాడి చేశారు. భూములు ఇవ్వని రైతులను వేధిస్తున్నారనే ఆరోపణల్లో నిజం ఉండబట్టే వారు ఈ దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి, జంగిల్ రాజ్ నడుస్తోంది” అని బొత్స విమర్శించారు.








